: ఐనవోలులో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి... ‘రాజధాని’ రైతుల సందేహాల నివృత్తి
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు క్రమంగా నిరసన గళం విప్పుతున్నారు. భూములిచ్చిన తమకు ప్రభుత్వం నుంచి అందనున్న ప్రతిఫలాలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మీడియాలో వెల్లువెత్తుతున్న పలు కథనాలతో రైతన్నలు ఆందోళన బాట పట్టే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించిన సీఏం నారా చంద్రబాబునాయుడు... వాస్తవాలను రైతులకు వివరించే పనికి శ్రీకారం చుట్టారు. ఈ బాధ్యతను చంద్రబాబు తన కేబినెట్ లోని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుల భుజస్కందాలపై పెట్టారు. దీంతో నేటి ఉదయమే ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారిద్దరూ రాజధాని ప్రాంతంలోని ఐనవోలులో వాలిపోయారు. అక్కడి గ్రామస్థులతో వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, ఇచ్చిన హామీ మేరకు అన్నింటినీ అందజేస్తామని వారు రైతులకు నచ్చజెబుతున్నారు. తమ వద్దకే వచ్చి తమ సందేహాలను నివృత్తి చేస్తున్న మంత్రుల మాటలను రైతులు ఆసక్తిగా వింటున్నారు.