: నేవీ ఫ్లీట్ రిహార్సల్ ఎఫెక్ట్!... విశాఖ గగనతలంలో ట్రాఫిక్ జామ్!


నవ్యాంధ్ర బిజినెస్ కేపిటల్ గా కొత్త రూపు సంతరించుకుంటున్న విశాఖలో అప్పుడే ట్రాఫిక్ జామ్ లు మొదలయ్యాయి. ఈ రద్దీ మనం నడిచే రోడ్లపై అనుకుంటే... తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే గగనతలంలో నెలకొంటున్న ఈ రద్దీ అటు విశాఖ వాసులనే కాక తరచూ ఆకాశయానం చేస్తున్న వారిని కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. అసలు విషయమేంటంటే... విశాఖలో అంతర్జాతీయ స్థాయి నేవీ ఫ్లీట్ కు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో విశాఖకు చేరుకున్న యుద్ధ విమానాలు రిహార్సల్స్ చేస్తున్నాయి. ఈ రిహార్సల్స్ కారణంగా విశాఖ గగనతలంపై ఇప్పటికే ఆంక్షలు అమలవుతున్నాయి. నిన్నటి రిహార్సల్స్ సందర్భంగా ఆంక్షలు అమలైనా, గగనతలంలో ఎయిర్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆంక్షలు ముగిసే సమయానికి విశాఖకు చేరుకున్న మూడు విమానాలు... ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడంతో గగనతలంలోనే చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఈ మూడు విమానాలు ఎదురెదురుగానూ వచ్చాయట. అయితే కొద్దిలో తప్పిపోయిన విమానాల ఢీ ఎయిర్ పోర్టు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టేలా చేసింది. ప్రమాదమైతే తప్పింది కాని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు రంగంలోకి దిగిన అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఫ్లీట్ రిహార్సల్స్ సందర్భంగా నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల దాకా విశాఖ గగనతలంలో ఆంక్షలు కొనసాగాయి. సాయంత్రం 5 గంటలకే రావాల్సిన ఎయిరిండియా విమానం ఆంక్షల గడువు ముగిసిన 7 గంటలకు విశాఖకు చేరుకుంది. అయితే ఎయిర్ పోర్టు నుంచి ల్యాండింగ్ కు అనుమతి రాకపోవడంతో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. అదే సమయంలో హైదరాబాదు నుంచి సాయంత్రం 4.20 గంటలకు విశాఖకు రావాల్సిన ఇండిగో విమానం 7.05 గంటలకు అక్కడకు చేరింది. ఈ విమానం కూడా ల్యాండింగ్ కు అనుమతి లేక దాదాపు 40 నిమిషాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఇక 7.10కి హైదరాబాదు నుంచి విశాఖకు చేరిన మరో ఇండిగో విమానం కూడా అరగంట పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ మూడు విమానాలు ఒకానొక సందర్భంలో ఒకదానికి మరొకటి ఎదురుపడ్డాయట. ఆ సమయంలో విమానాలు ఢీకొట్టుకుని ఉంటే పరిస్థితి ఏమిటని అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ మూడు విమానాల్లోని ప్రయాణికులు అసలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారట. చివరకు మూడు విమానాలు సురక్షితంగా ల్యాండవ్వడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News