: ఐఎస్ మిలిటెంట్లుగా 30 వేల మంది భారతీయులు?... స్వదేశంలో విధ్వంసానికి వారంతా సిద్ధమేనట!
ఈ వార్త నిజంగా భారత్ ను కలవరానికి గురి చేసేదే. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 30 వేల మంది... ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్)తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వీరందరినీ ఐఎస్ ఉగ్రవాదులు తమతో చేతులు కలిపేలా మార్చేశారట. అంతేకాక స్వదేశంపైనే వారితో దాడులు చేయించేందుకు కూడా ఐఎస్ వేసిన పక్కా ప్లాన్ కార్యరూపం దాల్చేందుకు మరెంతో సమయం పట్టదని కూడా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వీరందరిని తమవైపు తిప్పుకున్న ఐఎస్ ఉగ్రవాదులు ప్రభుత్వ విభాగాల నుంచి కీలక సమాచారం సేకరించడమే కాక వారితోనే దాడులకు ప్రణాళికలు రచిస్తోందని విశ్వసనీయ సమాచారం. దీనిపై ఇప్పటికే దాదాపుగా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఐఎస్ వలకు చిక్కిన వారిని గుర్తించే పనిని ప్రారంభించింది. ఈ క్రమంలో ఐఎస్ సమాచారం ఉన్న 94 వెబ్ సైట్లను నిలిపేసింది.