: పొగడ్తల పరాకాష్ఠ!... మోదీని రాముడిగా అభివర్ణించిన బాలీవుడ్ నటుడు
ప్రధాని నరేంద్ర మోదీపై పొగడ్తలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు మోదీని ఆకాశానికెత్తేస్తున్నారు. తామేమీ తక్కువ తినలేదంటూ బాలీవుడ్ నటులు కూడా మోదీ సహా, బీజేపీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నిన్నటిదాకా ఈ వరుసలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముందుండగా, తాజాగా హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ కూడా రంగంలోకి దిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీని రావల్... పురాణ పురుషుడు శ్రీరాముడితో పోల్చారు. మోదీ పేరుతోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాదులోని నిర్మా యూనివర్సిటీలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరేశ్ రావల్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రామాయణంలో రాముడి పేరుతో ఉన్న రాళ్లు సముద్రంలో వంతెనగా మారి ఆ మహా పురుషుడికి విజయం కట్టబెట్టిన తీరుగానే మొన్నటి ఎన్నికల్లో మోదీ పేరు బీజేపీకి విజయం కట్టబెట్టింది’’ అని రావల్ వ్యాఖ్యానించారు.