: టాస్క్ ఫోర్స్ పై ‘ఎర్ర’ కూలీల రాళ్ల దాడి... కాల్పులు జరిపిన పోలీసులు
తిరుమల వెంకన్న కొలువై ఉన్న శేషాచలం కొండల్లో నిన్న రాత్రి మరోమారు కాల్పులు శబ్దాలు వినిపించాయి. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరపడంతో అక్కడ మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తిరుమల సమీపంలోని శ్రీవారి మెట్టుకు కూతవేటు దూరంలో కూంబింగ్ జరుపుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు దాదాపు వంద మందికి పైగా ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దీంతో తమకు లొంగిపోవాల్సిందిగా పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే లొంగుబాటుకు ససేమిరా అన్న కూలీలు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో రాళ్ల దాడికి ప్రతిగా పోలీసులు తమ తుపాకులను ఎక్కుపెట్టారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దంతో బెంబేలెత్తిన కూలీలు దుంగలను అక్కడే పడేసి పరారయ్యారు. ఈ దుంగల విలువ రూ.4 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పారిపోయిన కూలీల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు ఘటనా స్థలికి బయలుదేరారు.