: నా జీవిత చరిత్ర సినిమాగా తీస్తే...నేనే నటిస్తా: బ్యాడ్మింటన్ స్టార్ సింధు ప్రకటన
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నటనకు సిద్ధంగా ఉన్నట్టు కనబడుతోంది. బాలీవుడ్ లో బయోపిక్ ల ఆధారంగా సినిమాల నిర్మాణం జోరందుకుంటోంది. ప్రధానంగా క్రీడాకారుల జీవిత చరిత్రలను సినిమాలుగా మలిచేందుకు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పిన్నవయసులోనే బ్యాడ్మింటన్ లో రికార్డుల దిశగా దూసుకుపోతున్న పీవీ సింధు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు ఎవరైనా ముందుకు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. అయితే టోర్నమెంట్లకు ఇబ్బంది లేకుండా షూటింగ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఈ సినిమాను ఎవరు తీస్తారు? ఎన్నిరోజుల్లో తీస్తారు? అనేది ప్రధానమని సింధు చెప్పింది. మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పిన సింధు, సినిమాలు ఎక్కువగానే చూస్తానని తెలిపింది. 'ఎస్' అనే అక్షరం తమకు బాగా కలిసి వచ్చినట్టుందని సింధు అభిప్రాయపడింది. సానియా, సైనాలు పద్మభూషణ్ లు అందుకోవడమే అందుకు ఉదాహరణ అని పేర్కొంది. బ్యాడ్మింటన్ లో మరింత రాణిస్తాననే నమ్మకాన్ని సింధు వ్యక్తం చేసింది.