: గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నారాయణ ఆరోపణలు
దేశంలో గవర్నర్ వ్యవస్థపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో రాష్ట్ర గవర్నర్లు కీలుబొమ్మల్లా మారారని విజయవాడలో ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఇదే విషయం మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. అసలక్కడ రాష్ట్రపతి పాలన సరికాదని, దానిపై ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థకు తాము పూర్తిగా వ్యతిరేకమని, ఆర్థికభారం తప్ప గవర్నర్ వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై నారాయణ మాట్లాడారు. అతని కులంపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబు అనడం దారుణమన్నారు. హైదరాబాద్ లో ఓటర్లు కావాలి గానీ, ఆంధ్రా విద్యార్థి చనిపోతే మాత్రం పట్టించుకోరా? అంటూ మండిపడ్డారు. మంత్రి రావెల కిషోర్ బాబును పంపి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.