: అఖిలేశ్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు... యూపీ లోకాయుక్తగా సంజయ్ మిశ్రా
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేటి ఉదయం షాకిచ్చింది. నెల క్రితం అఖిలేశ్ ప్రభుత్వం నియమించిన యూపీ లోకాయుక్త జస్టిస్ వీరేంద్ర సింగ్ స్థానంలో అలహాబాదు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ మిశ్రాను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే సంజయ్ మిశ్రా యూపీ లోకాయుక్తగా పదవీ బాధ్యతలు చేపడతారని కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. లోకాయుక్తగా వీరేంద్ర సింగ్ నియామకాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతతో బాటు, అలహాబాదు హైకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, అందరి ఆమోదంతోనే జస్టిస్ వీరేంద్ర సింగ్ ను లోకాయుక్తగా నియమిస్తున్నామని అఖిలేశ్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. దీనిపై వాస్తవాలు తెలుసుకున్న సుప్రీంకోర్టు తమనే తప్పుదోవ పట్టించారని అఖిలేశ్ సర్కారుకు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాక వీరేంద్ర సింగ్ స్థానంలో త్వరలో మరో న్యాయమూర్తిని నియమించడం ఖాయమేనని కూడా చెప్పింది. అయితే ఊహించని విధంగా సుప్రీంకోర్టు రోజుల వ్యవధిలోనే వీరేంద్ర సింగ్ స్థానంలో జస్టిస్ మిశ్రాను ఎంపిక చేస్తూ నేటి ఉదయం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.