: తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లకు అరెస్టు వారెంట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డిలపై అరెస్టు వారెంట్ జారీ అయింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాజేంద్రరెడ్డి నగర్ లో 19 ఎకరాల లేఔట్ లో పార్కులు, ప్రజావసరాల కోసం వదిలిన స్థలంలో నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ధర్మాసనం (చెన్నై బెంచ్) లో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని, దానిపై స్థాయి నివేదికను కూడా సమర్పించాలని సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ట్రైబ్యునల్ ఆదేశించింది. అయితే గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విచారణకు స్వయంగా హాజరుకాలేకపోతున్నామంటూ వారిద్దరి తరపు న్యాయవాది ట్రైబ్యునల్ కు నివేదించారు. దాంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రైబ్యునల్ ఈ నెల 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ నిన్న కూడా అధికారులిద్దరూ రాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది.