: రన్నింగ్ ట్రైన్ నుంచి దిగుతూ రైలు చక్రాల కింద నలిగిన మహిళ... ముంబైలో దారుణం
ముంబైలోని బొరివలి రైల్వే స్టేషన్ లో ఇటీవల దారుణం చోటుచేసుకుంది. ఈ మేరకు నిన్న వెలుగుచూసిన సీసీటీవీ ఫుటేజీలోని ఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు అక్కడ జరిగిందేమిటంటే... ఈ నెల 15న బొరివలి రైల్వే స్టేషన్ కు వచ్చిన ఓ రైలు ఇంకా పూర్తిగా నిలవలేదు. ఆ స్టేషన్ లో రైలు ఆగదనుకున్నారో, ఏమో తెలియదు కాని... కొంతమంది పురుషులతో పాటు మహిళలు కూడా రన్నింగ్ ట్రైన్ నుంచే దిగడం ప్రారంభించారు. ఓ రెడ్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి కూడా లగేజీతో దిగాడు. తన వెంట వస్తున్న మహిళను రైలు నుంచి కిందకు దించుకునేందుకు ఆ వ్యక్తి డోర్ వద్ద నిలబడ్డాడు. డోర్ వద్దకు వచ్చిన మహిళకు చేయిచ్చిన అతడు ఆమెను కిందకు కూడా దించేసుకున్నాడు. అయితే కిందకు దిగగానే, రన్నింగ్ ట్రైన్ నుంచి దిగిన కారణంగా మహిళ పట్టు తప్పింది. నిలబడలేకపోయింది. అక్కడే కింద పడిపోయింది. ఈ లోగా ఆమెకు చేయందించిన పురుషుడు ఆమెను పొదివి పట్టుకునేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. క్షణాల్లో ఆమె రైలు, ఫ్లాట్ ఫాం మధ్యనున్న గ్యాప్ లో కింద పడిపోయింది. ముందుగా తల అందులో పడగా, ఆమె కాళ్లను పట్టుకుని లాగేందుకు పురుషుడు చేసిన యత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఆ గ్యాప్ లో పడిపోయిన ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రైలు ఆగిన తర్వాత ఆమెను పైకి తీసి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అజాగ్రత్తే ఈ ప్రమాదానికి అసలు కారణమని సదరు సీసీటీవీ ఫుటేజీ చెప్పకనే చెప్పింది.