: ఆస్ట్రేలియాలో మెరిసిన తెలుగు తేజం!... చెన్నుపాటి జగదీశ్ కు ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారం


విశ్వవ్యాప్తంగా తెలుగు తేజాలు సత్తా చాటుతున్నారు. అమెరికాలో స్థిరపడ్డ సత్య నాదెళ్ల ఏకంగా సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు సీఈఓగా ఎంపికై సత్తా చాటగా, భౌతిక శాస్త్రవేత్తగానే కాక అధ్యాపకుడిగానూ విశేష సేవలందిస్తున్న చెన్నుపాటి జగదీశ్ కు ఆస్ట్రేలియాలో అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ లభించింది. కృష్ణా జిల్లా మారుమూల పల్లె వెల్లూరిపాలెంలో జన్మించిన జగదీశ్ 1977లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వర్సిటీలో 1986లో పీహెచ్ డీ పూర్తి చేసి, కొంతకాలం పాటు కెనడాలో అధ్యాపకుడిగా పనిచేశారు. అటు తర్వాత 1990లో ఆస్ట్రేలియా వెళ్లిన జగదీశ్.. ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ రంగాల్లో పరిశోధన సంస్థను స్థాపించారు. తదనంతర కాలంలో ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్ యూ)లో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరారు. వర్సిటీలో సెమీ కండక్టర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ విభాగాలకు అధిపతిగానే కాక ఆస్ట్రేలియన్ నేషనల్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీకి డైరెక్టర్ గానూ కొనసాగుతున్నారు. జగదీశ్ అందిస్తున్న విశేష సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం... ఆయనను తన అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’కు ఎంపిక చేసింది. మొన్న (మంగళవారం) ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెల్ బోర్న్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జగదీశ్ ఈ అవార్డును అందుకున్నారు.

  • Loading...

More Telugu News