: రోహిత్ వేముల దళితుడు కాదు: దోవల్ కు చేరిన రహస్య నివేదిక
దేశంలోని విశ్వవిద్యాలయాల్లో పెను కలకలం రేపిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కీలక మలుపు తీసుకుంది. వేధింపులు భరించలేక దళితుడైన రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలపై వర్సిటీ వీసీ అప్పారావు సహా, చర్యలకు ఒత్తిడి తెచ్చిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీలో రోహిత్ వేముల ప్రత్యర్థి వర్గంగా పేరుపడ్డ ఏబీవీపీ విద్యార్థులు... రోహిత్ అసలు ఎస్సీనే కాదని ఆరోపించారు. తాము ఎస్సీలం కాదు వడ్డెరలమని రోహిత్ తండ్రి మణికుమార్ కూడా ప్రకటించాడు. ఈ క్రమంలో దీనిపై దృష్టి సారించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. దోవల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఈ విషయంపై సమగ్ర వివరాలు సేకరించాయి. ఇందులో భాగంగా రోహిత్ తల్లి రాధికతో పాటు అతడి నానమ్మ రాఘవమ్మ వాంగ్మూలాలను సేకరించారు. ఈ వాంగ్మూలంలో తాము వడ్డెరలమేనని పేర్కొన్న రాఘవమ్మ, దళితులం కాదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సమగ్ర నివేదికతో పాటు రాధిక, రాఘవమ్మల వీడియో వాంగ్మూలాలను జతచేసిన నివేదికను నిఘా వర్గాలు అజిత్ దోవల్ కు నిన్న అందజేశాయి.