: విశాఖపట్టణం జిల్లాలో ఇరాన్ కు చెందిన అనుమానిత వ్యక్తుల అరెస్ట్!
విశాఖపట్టణం జిల్లాలోని నక్కపల్లి కాగిత టోల్ గేట్ వద్ద ఓ కారు నుంచి ఇద్దరు మహిళలు సహా ఐదుగురు ఇరాన్ దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురిని నర్సీపట్నం ఇన్ ఛార్జి డీఎస్పీ ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమానితులను అరెస్ట్ చేసి, విశాఖపట్టణానికి తరలించారు. వీరు ప్రయాణిస్తున్న కారు నంబరు ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, రెండు రోజుల క్రితం పక్క రాష్ట్రమైన ఒడిశాలో ఇరాక్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఒక హోటల్ లో దిగేందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమ పాస్ పోర్ట్ లు చూపించమని హోటల్ సిబ్బంది అడగటం, వారు అందుకు నిరాకరించడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమందించడం, ఈలోగా వారు పారిపోవడం జరిగింది. అయితే, ఆ నలుగురు అనుమానితులు ఉపయోగించిన కారు కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ పై ఉన్నట్లు పోలీసులు తొలుత గుర్తించారు. కానీ, అది తప్పుడు రిజిస్ట్రేషన్ అని ఆ తర్వాత తేలింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులెవరైనా తమ ప్రాంతాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారమందించాలని కోరారు.