: ‘నాటకం’ వారసత్వ సంపద: సీఎం చంద్రబాబు నాయుడు
‘నాటకం’ వారసత్వ సంపద అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన నంది నాటకోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలను చైతన్యపరచగల వ్యక్తులు ఒక్క కళాకారులు మాత్రమేనని, తాము ఒక్క మీటింగ్ లో చెప్పేది.. వీరు ఒక్క నాటకం ద్వారా కళ్లకు కట్టినట్లు చెప్పగలుగుతారని అన్నారు. రాష్ట్రంలో కళల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల పాఠ్యాంశాల్లోనూ కూచిపూడిని చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిని మహానగరంగా తీర్చిదిద్దుతామని, పర్యాటకంగా తిరుపతికి పెద్దపీట వేస్తామని చంద్రబాబు చెప్పారు. అనంతరం సీనియర్ నటుడు జేవీ రమణమూర్తికి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం-2015ను ప్రదానం చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నాటక పోటీల్లో విజేతలు బహుమతులు అందుకున్నారు.