: మా మధ్య చిచ్చుపెట్టకండి: ఎంపీ కవిత
హైదరాబాద్ లో నివసిస్తున్న వారంతా హైదరాబాదీలేనని.. అయితే, తమ మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. హైదరాబాదులో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ‘హైదరాబాద్ లో ప్రశాంతంగా నివసిస్తున్న వారి మధ్య చిచ్చు పెట్టేందుకు మంత్రి వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారు. ఆ పని చేయవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుని, ఇక్కడి వాతావరణాన్నంతా కలుషితము చేస్తున్నాయి. ఇరవై నెలల నుంచి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కలిసిపోయి ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ బిడ్డలు కానీ ఎవరినీ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చిన టీడీపీ నేత లోకేశ్, ఇతర నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం మతాన్ని వాడుకోవడానికి బీజేపీ చూస్తోంది. ఓట్ల కోసం మతాన్ని వాడుకునే పార్టీలను హైదరాబాద్ ప్రజలు బహిష్కరించాలి’ అని కవిత పేర్కొన్నారు.