: భారత్ విషయంలో ఐఎస్ఐఎస్ వ్యూహం ఇదే...!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావ దేశంగా భారత్ ఎదగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేఫథ్యంలో భారత్ అభివృద్ధిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు భారత్ లో మత మౌఢ్యంలో ఉన్న యువకులను ప్రలోభపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పలు సందర్భాల్లో జరిగిన ఘటనలను ముస్లిం యువకులకు విడమరచి చెబుతూ, భారత్ ను ముస్లిం వ్యతిరేక దేశంగా చిత్రీకరిస్తున్నారు. అదే క్రమంలో ఇస్లాం రాజ్య స్థాపనలో అహరహం శ్రమిస్తున్నామని, దైవరాజ్య స్థాపనలో భాగం కావాలని యువతకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో భావోద్వేగానికి గురైన యువకులు ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులు అవుతున్నారని ఎన్ఐఏ గుర్తించింది. ముఖ్యంగా ఐఎస్ఐఎస్ భారత ప్రభుత్వ మూలాలపై దెబ్బ కొట్టాలని భావిస్తోంది. గతంలో కేరళ ప్రభుత్వ సైట్లలో అక్రమంగా ప్రవేశించిన తీవ్రవాదులు అక్కడ ఐఎస్ఐఎస్ కు సంబంధించిన నినాదాలు ఉంచారు. దీనిని కేరళ హ్యాకర్స్ బృందం తీవ్రంగా పరిగణించింది. కేరళ ప్రభుత్వ సైట్లు స్తంభింపజేసిన క్షణాల్లోనే ఐఎస్ఐఎస్ కు చెందిన సైట్లలోకి వైరస్ ను ఎక్కించి వాటిని స్తంభింపజేశారు. అంతటితో ఆగని కేరళ హ్యాకర్స్ బృందం ఐటీలో ఐఎస్ఐఎస్ ఇంకా అమ్మ కూచి అని, భారత్ ఐటీ పరిశ్రమతో ఆటలాడవద్దని స్పష్టం చేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో సందిగ్ధంలో పడ్డ ఐఎస్ఐఎస్ భారతీయ ఐటీపై తన సానుభూతి పరులతో ఓ చిన్న స్థాయి పరిశోధన చేయించింది. భారత ఐటీ పరిశ్రమ చాలా బలమైనదని గుర్తించింది. భారత్ లోని ఐటీ పరిశ్రమలో ఉన్న ముస్లిం యువకుల సేవలు వినియోగించుకుంటే ప్రపంచానికి సవాలు విసరవచ్చని నిర్ధారణకు వచ్చింది. అందులో భాగంగా యువత బాగా ప్రభావితమయ్యే మతం, డబ్బు వలను విసిరింది. అలాగే మత అసహనంపై సానుభూతి పరులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా ప్రోత్సహిస్తూ, ఔత్సాహికులను ఆకట్టుకుని, సానుభూతి పరులను గుర్తిస్తోంది. కాగలకార్యాన్ని వారితో పూర్తి చేయవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా భారత నిపుణులతో ఐటీ పరిశ్రమలో సరికొత్త వింగ్ ను ఏర్పాటు చేయబూనింది. ఈ క్రమంలోనే హవాలా రూపంలో లక్షల రూపాయలను సరఫరా చేస్తూ, యువతను లొంగదీసుకుంటోంది. ఇందుకు తగ్గ ఆధారాలను ఎన్ఐఏ సంపాదించింది. తాజా దాడుల్లో ఐటీ పరిశ్రమకు సంబంధించిన వారు పట్టుబడడంతో ఐఎస్ఐఎస్ అసలు రూపం బట్టబయలైంది. భారత్ కు చెందిన ప్రభుత్వ విభాగాల సేవలు స్తంభింపజేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఐఎస్ఐఎస్ భవిష్యత్ వ్యూహాన్ని పసిగట్టిన భద్రతా సంస్థలు దానిని నిరోధించడంపై దృష్టి పెట్టాయి. కానీ మతం మత్తులో పడ్డ యువతను నిరోధించడం శ్రమతో కూడుకున్న పని అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మత పెద్దల సహకారం, సక్రమమైన మతబోధనలు అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.