: ఇంటర్నెట్ ను కనిపెట్టింది కూడా తానేనని చంద్రబాబు చెబుతారు: కేటీఆర్ సెటైర్
హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఐఫా అవార్డుల ఉత్సవం జరగడం వెనుక తెలంగాణ ప్రభుత్వం కష్టం ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులోని మాదాపూర్ లో ఐటీ ఉద్యోగులు లక్ష్యంగా జరిగిన గ్రేటర్ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలు విడిపోతేనే అభివృద్ధి సాధిస్తాయని చెప్పానని అన్నారు. అలాగే ఇప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథాన దూసుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఏర్పడితే లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, ఐఐటీ, సీపోర్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి టీఆర్ఎస్ పార్టీయే కారణమని ఆయన చెప్పారు. తాము చేసింది స్టేట్ ఫైటే కానీ స్ట్రీట్ ఫైట్ కాదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీరు చూస్తుంటే ఇంటర్నెట్ కనిపెట్టింది కూడా తానేనని చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. ఐటీ ఉద్యోగులంతా గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ లో పాల్గోవాలని ఆయన సూచించారు. మంచి నేతలను ఎన్నుకోకుంటే నష్టపోయేది ప్రజలేనని ఆయన సూచించారు. టీడీపీకి ఓటేస్తే వారు తెలంగాణకు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం అభివృద్ధిని మాత్రమే తన ఖాతాలో వేసుకున్నారని, ఐటీ ఇండస్ట్రీని నిలబెట్టింది తామేనని ఆయన చెప్పారు. ఐటీ రంగం దూసుకుపోయేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.