: దక్షిణాఫ్రికాపై గెలిచిన ఇంగ్లండ్... లాభం మాత్రం ఇండియాకు!
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు 2-1 తేడాతో విజయం సాధించగా, ఇండియా లాభపడింది. అదెలా, అనుకుంటున్నారా? టెస్టు టీమ్ లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ఈ ఓటమితో మూడవ స్థానానికి పడిపోగా, రెండో స్థానంలో ఉన్న ఇండియా ర్యాంకింగ్స్ లో మెరుగపడి నంబర్ వన్ కు చేరుకోగా, మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ కు చేరుకుంది. ఆగస్టు 2011లో టెస్టు జట్లలో తొలి స్థానం నుంచి దిగజారిన తరువాత ఇండియా తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. "ఇంగ్లండ్ జట్టు 2-1 తేడాతో సౌతాఫ్రికాపై గెలిచిన తరువాత, ఇండియా అధికారికంగా టెస్టు ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నిలిచింది" అని ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాద్వారా వెల్లడించింది. ఇక వచ్చే నెల 12 నుంచి న్యూజిలాండ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే, ఇండియాను దాటుకుని తొలి స్థానాన్ని చేరుతుంది. కాగా, ఈ జాబితాలో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు 4, 5 స్థానాల్లో నిలువగా, ఆపై న్యూజిలాండ్, శ్రీలంక, వెస్ట్ ఇండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వేలున్నాయి.