: ఎంఐఎం, బీజేపీ రెండూ విద్వేష పూరిత వాతావరణం నెలకొల్పుతున్నాయి: భట్టివిక్రమార్క
ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలు హైదరాబాదులో విద్వేషపూరిత వాతావరణం నెలకొల్పడానికి కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంఐఎం, బీజేపీ వాటి మిత్ర పక్షాలు హైదరాబాదు ప్రజల వద్దకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. మతతత్వపార్టీలు ప్రజలను సమానంగా చూడలేవని, ఆయా మతాల వ్యక్తుల కోసం పాటుపడతాయని ఆయన స్పష్టం చేశారు. ఆయా మతాలకు చెందని వారిపై విద్వేషాలు వెదజల్లుతాయని ఆయన తెలిపారు. కనుక గ్రేటర్ హైదరాబాదు ప్రజలు మతాల ప్రాతిపదికగా ఓట్లు వేయవద్దని, సుపరిపాలన లక్ష్యంగా ఓటర్లు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సామరస్యపూర్వక వాతావరణాన్ని ఈ పార్టీలు పాడుచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.