: వారంలోగా తేల్చకుంటే ఆత్మహత్య చేసుకుంటా: జేఎన్ యూ రీసెర్చ్ స్కాలర్ అల్టిమేటం
హెసీయూ ఘటనతో రేగిన కలకలం చల్లారకముందే ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ మదన్ మెహర్ వీసీకి రాసిన రెండు లేఖలు ఆందోళన కలిగిస్తున్నాయి. తనకు రావాల్సిన ఫెలోషిప్ ను నిలిపేశారని, పీహెచ్ డీని మధ్యలోనే ఆపేశారని, వివక్ష కారణంగా తనను వేధిస్తున్నారని మదన్ మెహర్ ఆ లేఖలో పేర్కొన్నాడు. వారంలోగా తన సమస్యను పరిష్కరించని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీనిపై వీసీ హెచ్.శర్మ మాట్లాడుతూ, మదన్ మెహర్ గతంలో బ్రసెల్స్, బెల్జియం దేశాల్లో రీసెర్చ్ నిమిత్తం యూనివర్సిటీ నుంచి 66,000 రూపాయలు తీసుకున్నాడని తెలిపారు. ఫెలో షిప్ రావాలంటే యూనివర్సిటీకి పడ్డ బకాయిని చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. బకాయిలు ఉన్నందున యూనివర్సిటీ కంట్రోలర్ అండ్ ఫైనాన్స్ విభాగం నుంచి అనుమతి లభించలేదని, దీంతో అతని ఫెలోషిప్ ఆగిందని తెలిపారు. విద్యార్థిని ఓ కంట కనిపెట్టమని సిబ్బందిని ఆదేశించామని, త్వరలోనే అతని సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఓ అధికారి వ్యాఖ్యానించారు.