: సొంతూళ్లోని అమ్మానాన్నల చెంతకు చేరేందుకు 370 మైళ్ల పరుగు!
తమ దేశ నూతన సంవత్సర వేడుకలను తన తల్లిదండ్రులతో కలసి జరుపుకోవాలని భావించాడు చైనాకు చెందిన హువాంగ్ చాంగ్ యాంగ్ (33). షెంజన్ సమీపంలో పని చేసుకుని పొట్టపోసుకుంటున్న అతని స్వస్థలం, అక్కడికి దాదాపు 370 మైళ్ల దూరంలోని చెంజోవ్. అక్కడికి వెళ్లడానికి టికెట్స్ బుక్ చేసుకోవాలని చూస్తే, రైళ్లు, బస్సులు అన్నీ ఫుల్. ఏం చేయాలని ఆలోచించిన హువాంగ్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. బ్యాగు భుజాన తగిలించుకుని పరుగు మొదలు పెట్టాడు. ఇప్పటికి 8 రోజులుగా అతని ప్రయాణం సాగుతోంది. రేపు సాయంత్రానికి హువాంగ్, తన స్వస్థలానికి చేరుకుంటాడట. హువాంగ్ కథ బయటి ప్రపంచానికి తెలిసి, అతను ప్రయాణిస్తున్న మార్గంలో అతన్ని చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారట. హువాంగ్ ప్రయాణిస్తున్న దూరం లండన్ నుంచి ఇడెన్ బర్గ్ మధ్య సాగే 14 మారథాన్ లతో సమానం. కాగా, చైనాలో కొత్త సంవత్సరం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ పర్వదినాన్ని అయినవారి దగ్గరుండి జరుపుకోవాలన్న కోరికతో కోట్లాది మంది స్వస్థలాలకు ప్రయాణాలు పెట్టుకోవడంతో అన్ని రకాల ప్రయాణ మార్గాలూ అత్యంత రద్దీతో ఉన్నాయి.