: కీసరలో కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని యువతి హల్ చల్!
ఆమె పేరు హర్షిత... తన ఫోటో తీశాడని ఆరోపిస్తూ, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుంది. అంతేకాదు, లాగి ఒక్కటిచ్చింది కూడా. పైగా, నోటికొచ్చినట్టు నానా మాటలూ అంది. చివరికి ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కుంటోంది. రంగారెడ్డి జిల్లా కీసరలో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బైక్ పై రాంగ్ రూట్లో వస్తున్న హర్షిత, మరో యువకుడిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపమని సూచించినా, ఆగకుండా దూసుకెళ్ళారు. పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ వెంకటేశ్ ఆ బైక్ ఫోటోను తీశాడు. అంతే, హర్షితలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్నే ఫోటో తీస్తావా? అంటూ దూసుకొచ్చింది. వెంకటేశ్ ను ఎడాపెడా వాయించింది. ఈ ఘటనతో చుట్టు పక్కల ట్రాఫిక్ స్తంభించి పోగా, పలువురు వీడియో తీశారు. వీడియో తీస్తున్న వారిపై హర్షితతో పాటు వచ్చిన యువకుడు కూడా దాడికి యత్నించాడు. ఘటనపై వెంకటేశ్ ఫిర్యాదు మేరకు హర్షితపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు.