: అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు ఆమోదం!
అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు మార్గం సుగమమైంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని భావించిన కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ రెండు రోజుల క్రితం సిఫార్సు చేసింది. అయితే, ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారంటూ రాష్ట్రపతి ప్రశ్నించారు. ఆ తర్వాత మంత్రులతో చర్చించి రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆమోదం తెలిపారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిని తొలగించేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు 21 మంది, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండి పెండెంట్ ఎమ్మెల్యేలు ఉపసభాపతికి మద్దతుగా నిలిచారు. సీఎంకు వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వీరందరూ ఆమోదించారు. మరో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేను సీఎంగా ఎన్నుకోవడం.. దీనిపై స్పీకర్ పిటిషన్ దాఖలు చేయడం.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయంపై కోర్టు స్టే విధించడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం జరిగింది.