: సముద్ర జలాల్లో ఘోరం... 31 మంది నీట మునుగుతూ ఉంటే చూస్తుండి పోయిన రెస్క్యూ బృందం!
గ్రీస్ సమీపంలో ఏజియన్ సముద్రంలో ఘోరం జరిగింది. శరణార్థులతో వస్తున్న ఓ చిన్న పడవ ప్రమాదంలో చిక్కుకుని, మునిగిపోతుంటే, సమీపంలోనే ఉన్న రెస్క్యూ బృందం చూస్తూ ఉండిపోయింది. ఏమీ చేయలేని తమ నిస్సహాయ స్థితికి, బాధపడటం తప్ప వారికి సహకరించలేకపోయామని ఇప్పుడా బృందం వాపోతోంది. ఆస్ట్రేలియా జాతీయుడు సిమాన్ లూయిస్, అతని బృందం గ్రీక్ దీవుల్లో భాగమైన లెస్బోస్ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఉండగా, ఈ ఘటన జరిగింది. సముద్ర జలాల్లో తిరుగాడుతున్న తమకు ఓ పడవ ప్రమాదంలో ఉన్నట్టు కనిపించిందని, దాని సమీపానికి వెళ్లి చూడగా, దాదాపు 31 మందితో ఉన్న పడవ తీరానికి చేరే పరిస్థితి లేదని తెలుసుకున్నామని, మహిళలు, చిన్నారులు ఉన్న ఆ పడవకు ఐదు మీటర్ల దూరంలో తాము ఆగిపోయామని సిమాన్ వెల్లడించారు. వారున్న పడవ టర్కీ పరిధిలోని జలాల్లో ఉండటం, తాము రక్షిస్తే, తమపై ప్రజలను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తాయన్న భయంతోనే దూరంగా ఉండిపోయామని తెలిపారు. "జీవితమంటే, ఇదే. మునిగిపోతున్న వారిని చూస్తూ కూడా కాపాడలేకపోయాము. అంతర్జాతీయ జల నిబంధనలు అలా వున్నాయి. ఓ మహిళ తన బిడ్డను తీరంవైపు విసరడం కనిపించింది. గుండెలు పగిలే పరిస్థితిలో ఆమెను చూస్తూ ఉండిపోయాం" అని అన్నారు. కాగా, ఈ ప్రమాదంలో తీరానికి కేవలం ఐదు మీటర్ల దూరంలో పడవ మునిగిపోగా, అందులోని 31 మందీ మరణించారు.