: ఆ ఒక్క అబద్ధం చెప్పుంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యుండేవాడు: వైకాపా నేత రవీంద్రనాథ్
రెండేళ్ల క్రితం ఒక్క అబద్ధం చెప్పుంటే ఇప్పుడు వైకాపా అధినేత వైఎస్ జగన్ సీఎం అయ్యుండేవారని ఆ పార్టీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజాయతీగా ఉండటమే ఆయన్ను అధికారానికి దూరం చేసిందని ఈ ఉదయం వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని పచ్చి అబద్ధం చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ మాట అన్నందుకు దూరమైన కేవలం 5 లక్షల ఓట్లు తమ పార్టీని అధికారానికి దూరం చేశాయని అన్నారు. ఈ ఉదయం కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ కు, పార్టీ అధికార గుర్తయిన టేబుల్ ఫ్యాన్ వచ్చిందని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, జగన్ ఏదైనా అంటే చేసి తీరుతారని, వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ను గెలిపించాలని కోరారు. ఎన్నికలకు ముందు రైతు రుణ మాఫీ, రాజధాని ప్రాంత రైతులకు రుణాలన్నీ మాఫీ అన్న చంద్రబాబు, ఇప్పుడు మాట మార్చి వారిని మోసం చేశారని ఆరోపించారు.