: ముస్లిం గర్ల్స్ పాఠశాలలో జెండావిష్కరణకు అడ్డు... కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక


భారత 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం నుంచి దేశవ్యాప్తంగా మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా, దేశ భక్తి గీతాలు హోరెత్తుతున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ప్రభుత్వ గుర్తింపుతో నడుస్తున్న ఓ ముస్లిం గర్ల్స్ పాఠశాలలో మాత్రం జాతీయ జెండా ఆవిష్కరణను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్న కొంతమందిని అక్కడికి దూసుకువచ్చిన కొందరు యువకులు బెదిరించారు. తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. జెండావిష్కరణను అడ్డుకున్నారని భావిస్తూ కొంతమంది యువకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే ముస్లిం పాఠశాలలో ఉర్దూ మినహా ఇతర భాషలను ఎలా బోధిస్తారని ఆ యువకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు... జెండావిష్కరణను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని, నాటకాలు కట్టిపెట్టాలని గట్టిగా హెచ్చరించారు. దీంతో తోకముడిచిన సదరు యువకులు కిమ్మనకుండా అక్కడి నుంచివెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News