: జుకెర్ బర్గ్ పితృత్వ సెలవు ముగిసింది...హ్యూమరస్ పోస్ట్ తో డ్యూటీలో చేరిన ఫేస్ బుక్ చీఫ్
ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ పితృత్వ సెలవు (పెటర్నిటీ లీవ్) నేటితో ముగిసింది. రెండు నెలల క్రితం జుకెర్ బర్గ్ సతీమణి ప్రిస్కిల్లా చాన్ పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చిన్నారి కూతురుకు ‘మ్యాక్స్’ అని పేరు పెట్టుకుని సంబరపడిపోయారు. భార్య డెలివరి, చిన్నారి కూతురు ఆలనా పాలన కోసం జుకెర్ బర్గ్ పెటర్నిటీ లీవ్ తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రెండు నెలల పాటు పూర్తిగా కుటుంబంతో గడిపిన ఆయన అప్పుడప్పుడు తన కూతురు ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తాజాగా జుకెర్ బర్గ్ సెలవు మంగళవారంతో ముగిసింది. ఇక డ్యూటీలో చేరాలిగా, ఈ సందర్భంగా ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న సదరు ఫొటోలో కేవలం బూడిద రంగులో ఉన్న టీ షర్ట్ లు, జాకెట్ లు మాత్రమే కనిపిస్తున్నాయి. ‘‘రెండు నెలల పితృత్వ సెలవు తర్వాత తొలి రోజు డ్యూటీకి వెళుతున్నాను, వీటిలో ఏ షర్ట్ వేసుకోవాలి?’’ అంటూ సదరు పోస్ట్ కు ఆయన ఓ హ్యూమరస్ కామెంట్ ను జత చేశారు.