: ఆమిర్ వివరణపై నెటిజన్ల మండిపాటు... ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ దంగల్’ హోరు!


‘దేశం విడిచి ఎక్కడికైనా వెళదామని నా భార్య చెప్పింది’ అన్న ఒకే ఒక్క వాక్యం బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ను చిక్కుల్లో పడేసింది. ఆ చిక్కుల నుంచి అతడు ఇప్పుడప్పుడే బయటపడే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. నిన్నటికి నిన్న ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన వ్యాఖ్యలపై ఆమిర్ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. 'ఇక్కడే పుట్టాను, ఇక్కడే చస్తా'నంటూ అతడు కాస్తంత భావోద్వేగంగా మాట్లాడాడు. దేశం విడిచి వెళ్లడమన్న మాటే లేదని ప్రకటించాడు. భారత్ అసహన దేశమని తానెన్నడూ అనలేదని కూడా అతడు సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఆమిర్ ఇచ్చిన సంజాయిషీ నెటిజన్లను ఏమాత్రం సంతృప్తిపరిచినట్లు లేదు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అతడి తాజా చిత్రం‘దంగల్’పై బహిష్కరణ వ్యాఖ్యలు మొదలయ్యాయి. ‘బాయ్ కాట్ దంగల్’ పేరిట ట్విట్టర్ లో నిన్న ప్రారంభమైన ఓ ప్రచారం హోరెత్తుతోంది. సినిమాల కోసం ఏమైనా చేయడానికి ఆమిర్ వెనుకాడటం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దంగల్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గంటగంటకూ ఈ ప్రచార ఉద్ధృతి పెరుగుతోంది.

  • Loading...

More Telugu News