: భారత్ అసహన దేశమని అనలేదు...నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆమిర్ ఖాన్
‘దేశం విడిచి వెళ్లిపోదామంటూ నా భార్య చెప్పింది’ అన్న ఒక్క కామెంట్ తో పెను విమర్శలు ఎదుర్కోవడమే కాక ఏకంగా ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ హోదాను కూడా కోల్పోయిన బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోమారు మీడియా ముందుకు వచ్చాడు. నిన్న ముంబైలో సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో అసలు తాను చేసిన వ్యాఖ్యలు, వాటి భావన, దానిని జనం అర్థం చేసుకున్న తీరు... తదితరాలపై మాట్లాడాడు. ‘‘భారత్ అసహన దేశమని నేనెప్పుడూ అనలేదు. దేశం విడిచి వెళతానని కూడా అనలేదు. ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందులో మీడియా తప్పు కూడా ఉంది. భావోద్వేగాలు దెబ్బతిన్నవారి ఆవేదనను అర్థం చేసుకోగలను. నేనిక్కడే పుట్టాను. ఇక్కడే చనిపోతాను. భారత్ లో ఉన్నంత వైవిధ్యం మరే దేశంలోనూ లేదు. నాకు నా దేశం అంటే చాలా ఇష్టం. విదేశాలకు వెళితే... రెండు వారాలకు మించి భారత్ ను వదిలి ఉండలేను’’ అని అతడు పేర్కొన్నాడు.