: అది.. నాకు రెండో జన్మతో సమానం: జూనియర్ ఎన్టీఆర్
సుమారు ఆరేళ్ల క్రితం.. మార్చి 26, 2009 న సూర్యాపేట సమీపంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు బోల్తాపడిన విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రమాదం గురించి ఆయన గుర్తు చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం నుంచి తాను బయటపడటాన్ని తనకు రెండో జన్మగా భావిస్తానని అన్నాడు. అదే తేదీన తన భార్య లక్ష్మీప్రణతి పుట్టిన రోజు అని, దాంతో ఆ రోజున రెండు బర్త్ డేలు మా ఇంట్లో జరుపుకుంటామని చెప్పాడు. తనకు జరిగిన ప్రమాదం తర్వాత జీవితాన్ని తాను చూసే కోణమే మారిపోయిందని, చావుకు భయపడే వ్యక్తిని కాదని.. అది తన దాకా వస్తే సంతోషంగా వెళ్లిపోతానంటూ జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా బాధగా ఫీలవకూడదు’ అనేది తన కోరిక అన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత తనను ఆసుపత్రికి తీసుకువెళ్లేటప్పుడు ‘మా అమ్మ, అభిమానులు, నా వస్తువులు, మా పెంపుడు కుక్క.. అన్నీ గుర్తుకొచ్చాయి. చనిపోతాననే భయం లేదు కానీ, సాధించాల్సింది ఎంతో ఉంది.. అప్పుడే ప్రాణాలు వదిలేస్తున్నానా! అన్న భావన వెంటాడింది. అయితే, అందరీ దీవెనలతో బతికి బయటపడ్డాను’ అని తారక్ ఉద్వేగంగా చెప్పాడు.