: భారీ లాభాల నుంచి నామమాత్రపు పెరుగుదల!
సెషన్ ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచికలు, మధ్యాహ్నం తరువాత యూరప్ మార్కెట్ల పుణ్యమాని కుంచించుకుపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, చైనాలో ఇటీవలి కాలంలో వచ్చిన తొలి ఐపీఓ అద్భుత రీతిన విజయవంతం కావడంతో, సెషన్ ఆరంభంలోనే 200 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్, ఆపై నెమ్మదిగా దిగివచ్చింది. చివరకు నామమాత్రపు లాభాల్లో నిలిచింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 50.29 పాయింట్లు పెరిగి 0.21 శాతం లాభంతో 24,485.95 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 13.70 పాయింట్లు పెరిగి 0.18 శాతం లాభంతో 7,436.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.24 శాతం, స్మాల్ క్యాప్ 0.94 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 22 కంపెనీలు లాభాల్లో నడిచాయి. కెయిర్న్ ఇండియా, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభపడగా, లార్సెన్ అండ్ టూబ్రో, గెయిల్, హీరో మోటో కార్ప్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 92,41,508 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మొత్తం 2,818 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,730 కంపెనీలు లాభాలను, 924 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.