: 'భారత్ నెట్' మరింత ఆలస్యం!


దేశమంతటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా, ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్స్ (బీబీఎన్ఎల్) తలపెట్టిన 'భారత్ నెట్' ప్రాజెక్టు మరింత ఆలస్యం కానుంది. సంస్థ చైర్మన్ గా అరుణా సుందరరాజన్ పదవీ విరమణ చేసిన అనంతరం మరొకరిని నియమించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత సంవత్సరం అక్టోబర్ లో అరుణను ఉక్కు శాఖ కార్యదర్శిగా నియమించిన తరువాత, బీబీఎన్ఎల్ కు మరో బాస్ రాలేదు. దీంతో భారత్ నెట్ మరింత ఆలస్యం అవుతోందని అధికారులే అంటున్నారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ కేబుళ్లను వేయడం ద్వారా మూడేళ్లలో ప్రజలందరికీ హై స్పీడ్ నెట్ సదుపాయాన్ని దగ్గర చేయాలన్నది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. తొలుత రూ. 20 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పూర్తవుతుందని భావించినప్పటికీ, ప్రాజెక్టుకు ఎదురైన బాలారిష్టాలు, ఆలస్యం తదితరాల కారణంగా అంచనా వ్యయం ప్రస్తుతం రూ. 74 వేల కోట్లకు పెరిగిపోయింది. 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కల్పించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఇదో క్లిష్టమైన ప్రాజెక్టని బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం ప్రస్తుత చైర్మన్, మాజీ టెలికం కార్యదర్శి ఎంఎఫ్ ఫరూఖీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే సంస్థ ఉద్యోగులంతా నిబద్ధతతో పనిచేయాల్సి వుందని అన్నారు. ఇదే సమయంలో భారత్ నెట్ ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత టెలికం విభాగానిదేనని బీబీఎన్ఎల్ తాత్కాలిక హెడ్ ఎన్ రవి శంకర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News