: అరుణాచల్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకెళతామన్న కాంగ్రెస్
అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసిన నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. నిన్నటి మోదీ కేబినెట్ నిర్ణయంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేసింది. కేంద్రం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేటి ఉదయం ఆమోద ముద్ర వేయడంతో అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చైనా సరిహద్దు రాష్ట్రంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ను అస్థిరపరచేందుకే మోదీ సర్కారు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది.