: గుజరాత్ లీల... ఇంటర్ విద్యార్థికి 100కు 101 మార్కులు!
నూటికి నూరు మార్కులు తెచ్చుకోగలిగిన సబ్జెక్టుల గురించి అందరికీ తెలుసు. కానీ నూటికి నూటొక్క మార్కులు వచ్చే సబ్జెక్టులు ఉంటాయా? ఈ లీల ఏంటో చూడాలంటే గుజరాత్ వెళ్లి గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (జీఎస్ హెచ్ఎస్బీసీ) అధికారుల తీరును గమనించాల్సిందే. ఇంటర్ పరీక్షల్లో ఓ విద్యార్థి 100 మార్కులకు పరీక్ష రాస్తే, అతనికి 101 మార్కులు వేశారు. సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని, తప్పు దిద్దుకున్నామని వారు చెబుతున్నా, జరిగిన నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణమైన వారికి నోటీసులు ఇచ్చామని, పరీక్షా పేపర్లు దిద్దిన ఔట్ సోర్సింగ్ ఏజన్సీదే తప్పని అధికారులు తెలిపారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నామని అన్నారు. రాయాల్సిన సమాధానాల కన్నా, అధికంగా రాసిన ఓ విద్యార్థి వాస్తవానికి 90 మార్కులు తెచ్చుకుంటే, కంప్యూటర్ తప్పిదం కారణంగా 101 మార్కులు వచ్చాయని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఔట్ సోర్సింగ్ ఏజన్సీ ఉపయోగించిన సాఫ్ట్ వేర్ విద్యార్థికి 11 మార్కులు అధికంగా వేసిందని వివరించారు. ఇలాగే ఎవరికైనా ఎక్కువ మార్కులు వచ్చాయా? అన్న విషయమై పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటన తరువాత గుజరాత్ టెక్నాలజీ యూనివర్శిటీకి చెందిన శ్రీ కంప్యూటర్స్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టును రద్దు చేశామని వివరించారు.