: ‘పఠాన్ కోట్’పై భారత్ మరిన్ని ఆధారాలిచ్చింది: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటన
పంజాబ్ లోని ఫఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడిపై పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోమారు నోరు విప్పారు. ఈ దాడికి కుట్ర పాక్ భూభాగం మీదే జరిగిందని, పాక్ లోనే ఉన్న జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కీలక సూత్రధారిగా వ్యవహరించారని భారత్ ఆరోపించింది. ఈ మేరకు కొన్ని ఆధారాలను కూడా పాక్ కు అందజేసింది. దీనిపై విచారణకు హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని, విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మౌలానాను అరెస్ట్ చేశామని ఒకసారి, గృహ నిర్బంధం విధించామని మరోసారి ప్రకటించిన పాక్, అసలు అతడిని అరెస్టే చేయలేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిన్న లండన్ వెళ్లిన ప్రధాని అక్కడి మీడియాతో మాట్లాడుతూ పఠాన్ కోట్ దాడికి సంబంధించి భారత్ మరిన్ని ఆధారాలు అందజేసిందని ప్రకటించారు. వీటిని పరిశీలిస్తున్నామని, నిందితులు తమ దేశ భూభాగంపై ఉన్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.