: సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని గంటల పాటు డిప్రెషన్ లో ఉన్నా: సుకుమార్
'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని గంటలపాటు తాను డిప్రెషన్ లో ఉన్నానని దర్శకుడు సుకుమార్ అన్నారు. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా అంతగా ఎక్కదు అన్న టాక్ వినిపించింది. దీనిపై మీరేమనుకున్నారన్న ప్రశ్నకు సుకుమార్ సమాధానమిస్తూ, ‘అంత కష్టపడి చేసినా ఇలా ఉంది అంటే ఎవరైనా సరే బాధ పడతారు. అందుకే సినిమా రిలీజు అయిన రోజు కొన్ని గంటలపాటు డిప్రెషన్ లో ఉన్నాను. 'ఆ రోజు సాయంత్రం మా గురువుగారు వి.వి.వినాయక్ నుంచి ఫోన్ వచ్చింది. 'ఇప్పుడే, మా మామయ్యగారు ఈ సినిమా చూసొచ్చారు. ఆయన చదువుకోలేదు. ఈ సినిమా ఎలా ఉంది? అని ఆయన్ని అడిగితే.. చాలా చాలా బాగుందని చెప్పారు. అందుకే, నువ్వు ఎవరేమి చెప్పినా వినొద్దు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది' అని వినాయక్ నాకు చెప్పారు. ఆ రోజు రాత్రి 7.30 తర్వాత సినిమా చాలా బాగుందంటూ నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో సినిమా సూపర్ హిట్టయిందని తెలిసిపోయింది’ అని సుకుమార్ చెప్పారు.