: ఎవరినైనా కాల్చి చంపినా నా ఓట్లు తగ్గవు: డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
త్వరలో జరిగే అమెరికన్ అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ లోని ఫిఫ్త్ అవెన్యూలో తాను ఎవరినైనా తుపాకితో కాల్చి చంపినా, తనకు ఓటర్లు ఎవరూ దూరం కారని వ్యాఖ్యానించారు. లోవాలో తొలి నామినేటింగ్ పోటీకి మరో 9 రోజుల సమయమున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన, ప్రజలు తెలివైన వారని, తనవెంటే నడుస్తారని అన్నారు. న్యూయార్క్ లో బిలియనీర్ గా, మాజీ టీవీ రియాలిటీ స్టార్ గా ప్రజల్లో గుర్తింపున్న ట్రంప్ పోటీలో ఉన్న ఇతరులతో పోలిస్తే ప్రచారంలో దూసుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముస్లింలను దేశం నుంచి తరిమికొట్టాలని ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, లోవాలో ఆయనతో పోటీ పడుతున్న టెడ్ క్రూజ్ మాట్లాడుతూ, "వినండి, డొనాల్డ్ మాటలకు నేను అడ్డుపడను. ప్రచారంలో భాగంగా ఎవరిపైనా విమర్శల తూటాలు వదలాలని నేను భావించడం లేదు. ప్రజలు ఆలోచించుకుని తమ నేతను ఎన్నుకుంటారు" అని వ్యాఖ్యానించారు.