: మోదీ సంకల్పం అద్భుతం... వస్తూనే హోలాండే పొగడ్తలు!
మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ మధ్యాహ్నం చండీగఢ్ కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, భారత ప్రధాని నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించాడు. పారిస్ నుంచి ఇండియాకు వస్తున్న ఆయన, మోదీ దార్శనికత, సంకల్పం అద్భుతమని కొనియాడారు. విమానంలో మీడియాతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ ప్రభుత్వంతో రఫాలే జెట్ విమానాల డీల్ కుదరడం వెనుక మోదీ ఎంతో కృషి చేశారని అన్నారు. వేల కోట్ల రూపాయల రఫాలే డీల్ సరైన దారిలో పయనించగా, ఇరు దేశాలూ సంతకాలు చేశాయని గుర్తు చేసిన ఆయన, మిగతా అన్ని విషయాలూ ఫైనలైజ్ అయ్యేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. ఫ్రాన్స్ నుంచి 36 రఫాలే విమానాలు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ తుది దశలో వాణిజ్యపరమైన ఒప్పందం హోలాండే ప్రస్తుత పర్యటనలో కుదురుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, మోదీ ద్వైపాక్షిక విధానం తనకెంతో నచ్చిందని, ఓ బలమైన ఆశయంతో ఆయన ముందుకు సాగుతూ, ఇండియాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని హోలాండే కితాబిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దేశం చేస్తున్న పోరు ఆగదని, ఇందుకోసం ఇరు దేశాలూ కలిసి పనిచేయాలని కోరారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడిని ఖండించిన ఆయన, తమ దేశంలో ఉగ్రమూలాలను ఏరివేసేందుకు పాక్ చర్యలు చేపట్టాలని సూచించారు.