: నేను రిటైర్ కావాలా? కోర్టులో పిటిషన్ వేసుకోండి: ధోనీ
ఇవాళా, రేపు భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు రిటైర్ మెంటు ప్రకటిస్తారు? అని చర్చించుకోవడం సర్వసాధారణమైపోయింది. ఇక ఇదే విషయాన్ని డైరెక్టుగా ధోనీని అడిగితే, "నా రిటైర్ మెంటా? కోర్టులో ఓ పిటిషన్ వేసుకోండి" అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో వన్డే టోర్నమెంట్ లు ముగిసిన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఈ సరదా ఘటన చోటు చేసుకుంది. పలువురు మాజీ క్రికెటర్లు ధోనీ క్రికెట్ కు పులుస్టాప్ పెట్టే సమయం వచ్చిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, మీడియా ఈ ప్రశ్నను ధోనీ ముందుంచింది. అంతకుముందు ధోనీ మాట్లాడుతూ, నాలుగో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగడానికి తానెప్పుడూ వెనుకాడనని, ఈ స్థానంలో ఆడటం ఎంతో ఒత్తిడితో కూడుకున్నదని అన్నాడు. ఒక్కోసారి కొద్ది ఓవర్లు మాత్రమే ఆడాల్సి రావచ్చని, మరి కొన్నిసార్లు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సి వుంటుందని గుర్తు చేశారు. సమయం వచ్చిందని భావిస్తే, తానే తప్పుకుంటానని, ఒకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.