: సాధ్వీ ప్రాచీ అరెస్టుకు వారెంట్ జారీ
విశ్వహిందూ పరిషత్ నేత, ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచివుండే సాధ్వీ ప్రాచీ అరెస్టుకు వారంట్ జారీ అయింది. ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో కోర్టుకు హాజారుకావాల్సిన సాధ్వి ప్రాచీ, గైర్హాజరు కావడంతో అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ సీతారాం ఈ వారెంట్ ను జారీ చేశారు. కేసును ఫిబ్రవరి 21కి వాయిదా వేస్తూ, ఆనాడు ప్రాచీ కోర్టుకు రావాలని ఆదేశించారు. ఇదే కేసు విచారణ డిసెంబర్ 18న జరిగినప్పుడు కూడా ఆమె కోర్టుకు రాలేదు. కాగా, ఇదే కేసులో కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్, బీజేపీ ఎంపీ భారతేందు సింగ్, ఎమ్మెల్యేలు సురేష్ రానా, సంగీత్ సోంలు పలు సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆదేశాల ఉల్లంఘన వంటి ఆరోపణలున్నాయి.