: లౌకికవాదం, ప్రజాస్వామ్యం... చెడు పదాలుగా వాడుతున్నారన్న భారతరత్నం!
ఇండియాలో లౌకికవాదం అన్న పదాన్ని చెడుగా వాడుతున్నారని, ఆ తరువాత ప్రజాస్వామ్యం కూడా అదే విధంగా వాడబడుతోందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. కోల్ కతాలోని నేతాజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, "ప్రస్తుతం ఈ దేశంలోని ప్రజలు మతాల వారీగా విభజించబడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది లౌలికవాదం కాదు. ఆ పదాన్ని ఓ చెడు మాటగా వాడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సాంఘక అసమానతలను తొలగించేందుకు ప్రయత్నించడం లేదు" అని విమర్శించారు. నేతాజీ మరణం వెనకున్న రహస్యాలను వెలికితీసే దిశగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలంతా సమానమేనన్న భావనతో పాలన సాగాలని, అందరికీ విద్య, వైద్యం అందాలని ఆయన అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.