: పరువు నిలిపిన పాండే...టీమిండియా గెలిచింది!
టీమిండియా వర్థమాన ఆటగాడు మనీష్ పాండే జట్టు పరువు నిలిపాడు. సీనియర్లు చూపిన బాటలో సెంచరీ సాధించి చివరి వన్డేలో జట్టును గెలిపించి, సిరీస్ క్లీన్ స్వీప్ ను అడ్డుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో చివరి వన్డేలో క్రికెట్ మజాను రెండు జట్లు అభిమానులకు రుచిచూపించాయి. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన వన్డేలో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధిచింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (99), శిఖర్ ధావన్ (78) ధాటిగా ఆడుతూ విజయానికి బాటలు వేశారు. ధావన్ అవుటైన తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ (8) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చి మనిష్ పాండే (104) ధాటిగా ఆడాడు. సెంచరీ ముంగిట రోహిత్ వెనుదిరగడంతో కెప్టెన్ ధోనీ (34) జత కలిశాడు. ఈ క్రమంలో కుదురుకునేందుకు ధోనీ సమయం తీసుకోవడంతో లక్ష్యం పెద్దది కాసాగింది. ఈ సమయంలో సమయోచితంగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, భారీ షాట్లు ఆడారు. ఈ క్రమంలో లక్ష్యం పెరుగుతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరిన దశలో ధోనీ అవుటైనా, కేవలం 81 బంతుల్లోనే సెంచరీతో సత్తాచాటిన పాండే సాధికారికమైన టెక్నికల్ షాట్లతో టీమిండియాను లక్ష్యం చేర్చాడు. దీంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో మూడు వికెట్లతో హేస్టింగ్స్ రాణించగా, మార్ష్ ఒక వికెట్ తీసి అతనికి సహకరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మనీష్ పాండే నిలిచాడు.