: ‘పోల్ మ్యాన్’ పంజాబ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు!... కాంగ్రెస్ ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2007 నుంచి వరుస ఓటములతో సతమతమవుతున్న అమరీందర్ సింగ్ ఈ దఫా ఎలాగైనా అకాలీదళ్ నేత, ఆ రాష్ట్ర ప్రస్తుత సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కు చెక్ పెట్టేందుకు పక్కాగా ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ‘పోల్ మ్యాన్’గా ప్రసిద్ధిగాంచిన ప్రశాంత్ కిషోర్ సాయాన్ని ఆయన తీసుకుంటున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ, బీహార్ కు వరుసగా మూడో దఫా సీఎంగా నితీశ్ కుమార్ ల ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ దే కీలక భూమిక. ‘చాయ్ పే చర్చా’, పర్చా పే చర్చా’ పేరిట 2014 సార్వత్రిక ఎన్నికలు, నిరుటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల ప్రచారం హోరెత్తిపోయింది. ఫలితంగా మొన్ననే బీహీర్ సీఎం నితీశ్ కుమార్ ఆయనను తన సలహాదారుగా నియమించుకోవడంతో పాటు కేబినెట్ హోదాను కల్పించారు. తాజాగా అమరీందర్ సింగ్ దృష్టి కూడా ‘పోల్ మ్యాన్’పైనే పడింది. ఇప్పటికే అమరీందర్ సింగ్ కు ప్రచారం చేసేందుకు ప్రశాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే పంజాబ్ వెళ్లనున్న ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులను కలవనున్నట్లు సమాచారం. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... సింగిల్ పైసా కూడా తీసుకోకుండానే అమరీందర్ సింగ్ కు ప్రచారం చేసి పెట్టేందుకు ప్రశాంత్ ఒప్పుకున్నారట.