: నల్గొండ జిల్లా పోలీసులు 'కిడ్నీ రాకెట్' దొంగలను ఆ విధంగా పట్టేశారు!


జల్సాలకు అలవాటుపడిన కస్పరాజు, సురేష్ తదితరులు తమ కిడ్నీలు అమ్మకుని, తమలాగే జల్సాలకు అలవాటు పడిన యువకులను కిడ్నీ అమ్మకానికి ప్రేరేపించి, వారితో కిడ్నీలు అమ్మించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఇంటర్నెట్ మాధ్యమంగా ఈ కిడ్నీ రాకెట్ కొనసాగుతోందని గుర్తించారు. దీంతో వీరిని అరెస్టు చేసేందుకు ప్రణాళికలు రచించారు. అయితే రాజు, సురేష్ ల అరెస్టు గురించి తెలుసుకున్న కీలక సూత్రధారి, గుజరాత్ కు చెందిన సురేష్ ప్రజాపతి ఆన్ లైన్ నుంచి మాయమయ్యాడు. నెట్ లో ఉంచిన నెంబర్ ను మార్చేశాడు. అహ్మదాబాద్ లో ఉన్న ఆఫీస్ ను మూసేశాడు. తన సహచరులను కూడా అలెర్ట్ చేశాడు. దీంతో పోలీసులు ఆన్ లైన్ లోని అతని ఫేస్ బుక్ అకౌంట్ ను కనుక్కొని, ఓ నెంబర్ సాయంతో అందులో ప్రవేశించారు. అతని ఫ్రెండ్స్ లిస్ట్ ను ట్రాప్ చేసి, వారి నుంచి సురేష్ ప్రజాపతి ఎక్కడున్నాడో రాబట్టారు. దీంతో అహ్మదాబాద్ వెళ్లిన నల్గొండ పోలీసులు, ప్రజాపతి ఉంటున్న ఇంటిని కనిపెట్టారు. కొరియర్ బాయ్ లమంటూ అతని ఇంటికెళ్లారు. సురేష్ ప్రజాపతి అక్కడే ఉన్నాడని నిర్ధారించుకుని, తలుపు తీసిన వ్యక్తిని మంచి నీళ్లు కావాలని అడిగారు. ఈ వంకతో ఇంట్లోకి వెళ్లి అక్కడున్న సురేష్ ప్రజాపతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ నుంచి మరో ఏజెంట్ దిలీప్ కు ఫోన్ చేసి, కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దీంతో ఆయన రమ్మన్న ప్లేసుకు వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇందులో మరో కీలకమైన ఏజెంట్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన వ్యక్తిని, అలాగే ముంబైలో ఉన్న సురేష్ ప్రజాపతి రైట్ హ్యాండ్ ను కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకోగలిగితే కిడ్నీ రాకెట్ నిర్వాకంతో కిడ్నీలు కోల్పోయిన మరో 100 మంది గురించి తెలుస్తుందని నల్గొండ జిల్లా పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News