: సెన్సెక్స్ బుల్ హైజంప్!
గత కొన్ని రోజులుగా పడుతూ, లేస్తూ, నష్టాల్లోకి దిగజారుతూ వస్తున్న భారత స్టాక్ మార్కెట్ బుల్ నేడు హైజంప్ చేసింది. ఆసియా మార్కెట్ల సరళి, క్రూడాయిల్ ధరల్లో రికవరీ తదితరాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచగా, సెషన్ ఆరంభంలోనే 200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ ఆపై ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు. మధ్యాహ్నం తరువాత యూరప్ మార్కెట్లలో కొనుగోళ్లు నమోదు కావడం భారత మార్కెట్లకు లాభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 463.45 పాయింట్లు పెరిగి 1.98 శాతం లాభంతో 24,435.66 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 145.65 పాయింట్లు పెరిగి 2 శాతం లాభంతో 7,422.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.90 శాతం, స్మాల్ క్యాప్ 2.25 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 43 కంపెనీలు లాభాల్లో నడిచాయి. గెయిల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో, మారుతి సుజుకి, ఎస్బీఐ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, భారతీ ఎయిర్ టెల్, బోష్, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 92,05,602 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మొత్తం 2,821 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 2,060 కంపెనీలు లాభాలను, 598 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.