: ఎంఎంటీఎస్ రెండో దశను పొడిగించాలంటూ... రైల్వే మంత్రికి కేసీఆర్ లేఖ
ఎంఎఎంటీఎస్ సర్వీసు రెండో దశ పొడిగింపుపై కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఎంఎంటీఎస్ సర్వీసును రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు విస్తరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అందుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర వాటాను భరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రూపొందించబోయే రైల్వే బడ్జెట్ లో ఈ సర్వీసు పొడిగింపుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. రాయగిరి సమీపంలోనే ప్రముఖ యాదిద్రి దేవస్థానం ఉందని, హైదరాబాద్ నుంచి ఎంతోమంది భక్తులు యాదాద్రికి వెళుతుంటారని, తిరుపతి స్థాయిలో దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని వివరించారు. దానిని పరిగణనలోకి తీసుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ ను విస్తరించాలని లేఖలో వినతి చేశారు.