: జర జాగ్రత్త...మీ ఫేస్ బుక్ ను నాలుగు కళ్లు గమనిస్తున్నాయ్!


'మీ స్నేహితుల గురించి చెప్పు, నువ్వేంటో చెబుతాను' అన్నది సామెత. తాజాగా సోషల్ మీడియాలో నువ్వు పెట్టిన పోస్టులు నువ్వేంటో చెబుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో వారి బుట్టలో పడుతున్నది విద్యావంతులైన మతోన్మాదులేనని నిఘావర్గాలు పసిగట్టాయి. సోషల్ మీడియాలో యువతరం కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది యువత సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో, తమ బుట్టలో ఎవరు పడతారా? అని డేగ కళ్లతో ఐఎస్ఐఎస్ ప్రతినిత్యం సోషల్ మీడియాను గమనిస్తోంది. మతానికి మద్దతుగా పోస్టులు పెట్టిన వారిని కాంటాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమాత్రం తప్పటడుగు వేసినా పెను ప్రమాదం చుట్టుముట్టినట్టే. అదే సమయంలో భద్రతా దళాలు కూడా అలాంటి పోస్టులను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఈ సమయంలో భద్రతాధికారులకు ఏ మాత్రం అనుమానం వచ్చినా తీసుకెళ్లి వారి పద్ధతుల్లో మర్యాదలు చేసి, విషయం రాబడతారు. తరువాత ఇండియన్ పీనల్ కోడ్ తన పని తాను చేసుకుపోతుంది. కనుక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే, పెను ప్రమాదం చుట్టుముట్టినట్టే. 'ఆ పోస్టు సరదాగా పెట్టా'నని చెప్పినా, 'అందులో అంత అర్థం ఉందని తెలీదు' అని అన్నా ప్రయోజనం ఉండదు. కనుక సోషల్ మీడియాలో పోస్టు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News