: పెరుగుతున్న అరెస్టులు... అనుమానం వస్తే అదుపులోకి... ఏం జరుగుతోందీ దేశంలో!


పఠాన్ కోట్ నుంచి ఓ కారును అద్దెకు తీసుకోని, ఆపై కారు డ్రైవర్ ను హతమార్చి ఢిల్లీలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానం నేపథ్యంలో ఢిల్లీ, దాని చుట్టుపక్కలా ఉన్న యూపీ పరిధిలోని నోయిడా నుంచి ముజఫర్ పూర్ వరకూ అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టాక్సీ డ్రైవర్ ను హత్య చేసినట్టుగా భావిస్తున్న ముగ్గురు యువకులు మరేదైనా మార్గం గుండా దేశంలోని ఇంకేదో ప్రాంతానికి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్న భద్రతాదళాలు, నిఘా వర్గాలు అన్ని ప్రధాన నగరాలనూ జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో విస్తృత సోదాలు జరుపుతున్న పోలీసులు అనుమానం వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. బైకులపై వెళుతున్న వారిని సైతం అడ్డగించి సరైన పత్రాలు లేకుంటే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకూ వందలాది మందిని పోలీసులు నిలువరించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ దేశంలో ఏమవుతోందని సామాజిక మాధ్యమాల్లో మధ్యాహ్నం నుంచి చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా, నేటి సాయంత్రం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశానికి ఎన్ఐఏ, నిఘా, సైన్యాధికారులను పిలిచారు. వారితో చర్చించిన మీదట మీడియాతో మాట్లాడనున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్న పోలీసులు 20 మందికి పైగా యువకులను ప్రశ్నిస్తున్నారని సమాచారం. పలు చోట్ల తమను ఆపి ప్రశ్నిస్తున్న పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగుతున్నారు. పఠాన్ కోట్ నుంచి ఉగ్రవాదులు కచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రదాడికి రూపకల్పన చేస్తుండవచ్చని భావిస్తున్న భద్రతాదళాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

  • Loading...

More Telugu News