: రూ. 47 కోట్లు వేస్ట్... మిగిలిపోయిన 'చంద్రన్న కానుక'
సంక్రాంతి పర్వదినాన పేదల ఇంట తృప్తికరమైన భోజనం ఉండాలన్న లక్ష్యంతో, ఏపీలోని 1.40 లక్షల రేషన్ కార్డుదారులకు పంచాలని ప్రతిపాదించి తయారు చేసిన 'చంద్రన్న కానుక'ల్లో దాదాపు 17 లక్షల ప్యాక్ లు మిగిలిపోవడంతో రూ. 47 కోట్ల ప్రజాధనం వృథా అయింది. ఈ నెల ఏడో తేదీ నుంచి పండగ వరకూ వీటిని పంపిణీ చేయగా, మధ్యలో కొన్ని రోజులు సర్వర్ల జామ్ కారణంగా పంపిణీ జరగలేదు. అప్పట్లో వీటిని ఉచితంగా ఇచ్చారు. పండగ తరువాత వీటిని అమ్మాలని చూస్తే, ముందు ఉచితంగా ఇచ్చిన సరుకులను డబ్బులకు అమ్ముతున్నారన్న చెడ్డ పేరు వస్తుందని అధికారులు వెనుకాడుతున్నారు. ఈ ప్యాక్ లలో బెల్లం, కందిపప్పు, గోధుమ పిండి, నెయ్యి, పామాయిల్, శనగపప్పు వంటివి ఉన్నాయి. వెంటనే వీటిని పంచకుంటే, సరుకులు పాడైపోతాయన్న భయాలూ ఉన్నాయి. ఒక్కో ప్యాక్ విలువ రూ. 275 అన్న సంగతి తెలిసిందే. మిగిలిన ప్యాకెట్లను స్టాక్ పాయింట్లకు పంపాలని కోరితే, దానికి అదనంగా ఖర్చయ్యే రవాణా ఖర్చు ఎవరు భరించాలని రేషన్ షాపు డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తుండటంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక వీటిని ఏం చేస్తారన్నది చంద్రబాబు తుది నిర్ణయం ఆధారంగా తీసుకుంటామని అధికారులు అంటున్నారు.