: ప్రచార ఆర్భాటానికి 11 నెలల్లో రూ. 60 కోట్లు ఖర్చు పెట్టిన 'సామాన్యుడి' ప్రభుత్వం!
సామాన్యుడి ప్రభుత్వంగా ప్రకటించుకుని ఢిల్లీ గద్దెనేలుతున్న అరవింద్ కేజ్రీవాల్ సర్కారు, గత 11 నెలల్లో ప్రచార ఆర్భాటానికి అక్షరాలా అరవై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నామంటూ, పత్రికలు, టెలివిజన్, రేడియో, హోర్డింగులు తదితరాలకు ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. ఒక్క సరి బేసి విధానానికే రూ. 2 కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. తదుపరి ఫిబ్రవరి 14న ప్రభుత్వం తొలి వార్షికోత్సవం సందర్భంగా, ఈ సంవత్సరం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, భారీగా ప్రచారం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, గత సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా, సమాచార, పౌర సంబంధాల శాఖకు రూ. 526 కోట్లు కేటాయించిన ఆప్ సర్కారు మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచారం ఉపకరిస్తుందని వ్యాఖ్యానిస్తుండగా, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.